ఆషాడం -ఆహారం -ఆరోగ్యం

మునగాకు,నేరేడుపండు,గోరింటాకు

             అవునండీ !ఈ మూడింటిని ఆషాడం లో కనీసం ఒక్కసారైనా వాడుకోవాలని ,పెద్దలు చెబుతారు. గోరింటాకు నూరి చేతికి పెట్టుకోవడం ఎటూ అందరికీ ఇష్టమేననుకోండీ !ఇక మిగిలిన రెండింటినీ ,తప్పక తినాలి.
             
పెద్దవాళ్ళు చెప్పారంటే ,అందులో తప్పక ఏదో ఒక ఆరొగ్యసూత్రమ్  తప్పక ఉంటుందని నాఅభిప్రాయం . మంచిదేకదా!అని ఫాలో అయిపోవడమే . అబ్బే !అలా గుడ్డిగా ఫాలోఅవడం కుదరదూ అంటే, మునగాకు ఉపయోగాల్ని గూర్చి ,ఆయుర్వేద నిపుణులు చెప్పిన విషయాలకు, సంబంధించిన  ప్రచురణ జత చేస్తున్నాను, చూడండి .

            మా పెరట్లో మునగచెట్టు ఉంది కాబట్టి నేను ఎక్కువగానే వాడుతుంటాను . కాడలు లేకుండా శుభ్రం చేసి ,కడిగి ,సన్నగా తరిగి ,మెంతికూర లాగా అన్ని కూరల్లొనూ ,వాడుకోవచ్చు .

          తమిళులు బాగా వాడతారు . మాకు ఇద్దరు తమిళ స్నేహితులు ఉన్నారు . ఎంత ఆకు ఇచ్చినా , ఎన్ని సార్లు ఇచ్చినా ,వద్దనే అనరు . అంత ఇష్టం . ఇంకా చాలా మంది అడిగి తీసికెల్తూ ఉంటారు . ఇంకో ముఖ్యమైన సంగతి చెప్పాలి మీకు,అసలు మునగాకును కూర చేసుకుంటారని తెలియని వాళ్ళ  వెంటబడి ,ఈ కటింగ్ చూపించి మరీ ,ఆకును అంటగడుతూ ఉంటాను . తిన్నాక వాళ్ళు బావుందనే చేబుతారులెండి . (చెప్పక చస్తారా మరి!)
ఈ రోజు నేను చపాతి లోకి ఆలు ఉల్లిపాయతో మునగాకు కలిపి కూర చేసాను .  చూడండి .  

                          ఇక నేరేడుపండు విషయానికొస్తే ,మనకు తెలియకుండా ఆహారం ద్వారా మన కడుపు లోకి చేరే వెంట్రుకల్ని కత్తిరించి బైటకు పంపే శక్తి , దానికి ఉంటుందట . అందుకే తప్పక ఒక్కసారైనా తినాలట .
ఇవండీ !ఆషాడం కబుర్లు . కాస్త ఆలస్యమైంది కదండీ ,ఏం పర్వాలేదు ,ఇంకా మూడు రోజులు ఉందండీ మూడింటి కోసం ప్రయత్నించండీ !

8 Comments

  1. మునగాకులో కావలసినంత ఇనుము ఉంది, నేరేడు పండు తింటే కడుపులో ఉన్న వెంట్రులలాటివి సహితం కరిగి అరిగిపోతాయంటారు, అదీగాక సుగర్ ని కంట్రోల్ చేస్తుంది. గోరింటాకు పుప్పిగోళ్ళను అరికడుతుంది.ఇంకా చెప్పాలంటే టపా రాయాలి 🙂

    Like

  2. అవునండి మునగాకు రక్తం తక్కువగా ఉన్నవాళ్ళ బాగా తినాలి .ఎవరికైనా మంచిదే నేనూ బాగా వాడతాను.గోరింటాకు మా అమ్మాయిసెలవలకి వస్తే ఇద్దరం పె ట్టు కున్నాం ఆషాడం అని.

    Like

  3. మంచి పోస్ట్ నాగరాణి గారు. ఫస్ట్ ఫోటో చూడగానే నోరూరింది. ఎలా చేసుకోవాలో కూడా చెప్పి ఉంటే ఎంత బావుండేదో.. బాబ్బాబు నేర్పించి పుణ్యం కట్టుకోండి 🙂

    Like

  4. ధన్యవాదాలు శర్మ గారూ !మీకూ మిత్ర దినోత్సవ శుభాకాంక్షలు ,కాస్త ఆలస్యంగా . నా టపాలకు ఓపికగా వ్యాఖ్యలు .పెడుతున్నందుకు కృతజ్ఞతలు .

    Like

  5. thanks priya ,మంచి పోస్ట్ అన్నందుకు .కూర చెయ్యడం చాలా సులభం .రెండు చెంచాల కాగిన నూనె లో పోపుగింజలు వేయించిన తరువాత ,తరిగిన ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత ,తరిగిన బంగాళదుంపముక్కలు ,పచ్చిమిర్చి చీలికలు ,సరిపోను ఉప్పు ,పసుపు వేసి మూతపెట్టి,కాసేపుమగ్గించాలి .కారం వాడొద్దు . కూర మగ్గి .మెత్తబడిన తర్వాత సన్నగా తరిగిన మునగాకు ,జల్లినట్లుగా వేయాలి .ఒకేచోట వేస్తే అతుక్కున్నట్టు అవుతుంది . ఒక్క నిమిషం వేయించి,కాసిని నీళ్ళు పోసి మూతపెట్టి ఉడికంచాలి .3నిముషాలు చాలు .ఆకుకూర3లేదా 4నిముషాల కన్నా ఎక్కువ .ఉడికిస్తే పోషకాలు నశిస్తాయట .చివరిగా .దింపే ముందు బుల్లిగ్లాసు నీళ్ళలో 2లేదా3చెంచాల శనగపిండి వేసి ఉండల్లేకుండా కలిపి .కూరలో పోసి,కుతకుతమననే దాకా అంటే 2నిముషాలు తరువాత దింపేస్తే ,చపాతి,పూరీ,దోశల్లోకి కూర రడీ .కొత్తిమిర అవసరం .కూడా లేదు .

    Like

  6. చాలా చాలా థాంక్స్ రాణి గారు.. అడిగిన వెంటనే చెప్పినందుకు. తప్పకుండా ప్రయత్నిస్తాను 🙂

    Like

Leave a reply to Anonymous Cancel reply